మామునూరు ఎయిర్ పోర్ట్ కు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి
నారాయణఖేడ్ కురుమ సంఘం డిమాండ్..
నారాయణఖేడ్ :అక్టోబర్ 02, (ప్రజావాణి )
వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్ట్ కు తెలంగాణ తొలి అమరవీరుడు, కురుమ ముద్దుబిడ్డ దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్. చేస్తూ నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం కురుమ విద్యావంతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ పార్కులో జరిగిన, ఈ సమావేశానికి కురుమ సంఘం నాయకులు, విద్యావంతులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు లొండే నర్సింలు మాట్లాడుతూ.. 1946లో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జనగామ జిల్లా కడివెండి గడ్డపై తుపాకి తూటలకు ఎదురొడ్డి అమరుడైన వీరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన తొలి అమరుడు ఆయనేనని, తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆయనకు ఇప్పటివరకు సముచిత గౌరవం దక్కలేదన్నారు.ఇప్పుడు వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎయిర్ పోర్ట్ కు దొడ్డి కొమురయ్య పేరు పెట్టడం ద్వారా ఆయన త్యాగాన్ని ప్రపంచానికి చాటాలని అన్నారు.
ఇది ఏ ఒక్క కులానికి సంబంధించిన డిమాండ్ కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. ఈ డిమాండ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, అన్ని పార్టీల నాయకులను కలిసి మద్దతు కూడగడతామని తెలిపారు. త్వరలోనే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నర్సింలు, డాక్టర్ ఓం ప్రకాష్ మల్గొండ, సర్పంచ్ లు సుభాష్ చంద్రబోస్, నగేష్, మండలాల అధ్యక్షులు నావనాథ్, కాసినాథ్, మల్లేష్, జైపాల్, శ్రవణ్, భీమన్న, ఉపసర్పంచ్ నర్సింలు, సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

