📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalమత సామరస్యానికి ప్రతీకగా గణపయ్య లడ్డూ.. లక్కీ డ్రాలో విజేతగా ముస్లిం సోదరుడు!

మత సామరస్యానికి ప్రతీకగా గణపయ్య లడ్డూ.. లక్కీ డ్రాలో విజేతగా ముస్లిం సోదరుడు!

📰 Generate e-Paper Clip

మత సామరస్యానికి ప్రతీకగా గణపయ్య లడ్డూ.. లక్కీ డ్రాలో విజేతగా ముస్లిం సోదరుడు!

 

చెన్నారావుపేట సెప్టెంబర్ 25 ప్రజావాణి

మత విశ్వాసాల కన్నా మానవత్వం, భక్తిభావమే మిన్న అని నిరూపిస్తూ.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ (కట్టయ్యపల్లి) గ్రామంలో ఓ అరుదైన, సుందర ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలో మిత్ర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య ప్రసాదం (లడ్డూ) లక్కీ డ్రాలో ముస్లిం సోదరుడు మహమ్మద్ శోహీద్‌ను వరించడం స్థానికంగా విశేషంగా మారింది.

 

 

ఘనంగా గణేష్ నవరాత్రులు ప్రత్యేకంగా లక్కీ డ్రా..

నవరాత్రుల సందర్భంగా స్వామివారి చేతిలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న దివ్యమైన లడ్డూ ప్రసాదం కోసం ఉత్సవ కమిటీ రూ. 50 చొప్పున మొత్తం 250 లక్కీ డ్రా కూపన్లను గ్రామస్తులకు విక్రయించింది. గణనాథుడి ఆశీస్సులు అందరికీ దక్కాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ డ్రాలో చెన్నారావుపేట శివాలయం ఎదురుగా ‘జనతా ఫర్టిలైజర్స్’ నిర్వహిస్తున్న మహమ్మద్ సుభాన్ రెండు కూపన్లు తీసుకున్నారు. అందులో ఒక కూపన్‌ను తన కుమారుడు శోహీద్ పేరిట, మరొకటి వ్యాపార సంస్థ పేరిట తీసుకున్నారు.

అలరించిన ఊరేగింపు.. ముస్లిం సోదరుడు శోహీద్‌కే విజయం..

బుధవారం సాయంత్రం గణపయ్య నిమజ్జన ఊరేగింపు ప్రారంభానికి ముందు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో నిర్వాహకులు అత్యంత పారదర్శకంగా లక్కీ డ్రా తీశారు. డ్రాలో మొదటి విజేతగా మహమ్మద్ శోహీద్ పేరు రావడంతో పరిసర ప్రాంతమంతా హర్షధ్వానాలతో మిన్నుముట్టింది. బొజ్జ గణపయ్య దివ్య ప్రసాదం చెన్నారావుపేటలోని జనతా ఫర్టిలైజర్స్ నివాసానికి చేరుకుంది.

 

ఆనందం వ్యక్తం చేసిన విజేత..మెచ్చుకున్న గ్రామస్తులు..

ఈ సందర్భంగా విజేత మహమ్మద్ శోహీద్, ఆయన తండ్రి సుభాన్ మాట్లాడుతూ.. “తొమ్మిది రోజుల పాటు పవిత్ర పూజలందుకున్న విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదం మాకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. గణపయ్య దీవెనలు మా కుటుంబంపై ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది” అని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుడికి లడ్డూ దక్కడంపై గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది గ్రామంలోని మతసామరస్యానికి నిదర్శనమని కొనియాడారు.ఈ వేడుకలో మిత్ర వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, విగ్రహ దాత తూటి శ్రీనివాస్, కమిటీ అధ్యక్షుడు ముత్యం చేరాలు, గౌరవ అధ్యక్షుడు కోరే రమేష్, ప్రతినిధులు కక్కెర్ల శ్రీనివాస్, కోశాధికారి జీనికిరి రాజ్ కుమార్, కాటి హరీష్, లకిడి ప్రసాద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.