ఎల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
గ్రామ ముఖద్వారం వద్ద అనుమతులు లేకుండా మూడు వాణిజ్య షట్టర్ల నిర్మాణం
నిర్మాణం పూర్తవుతున్నా స్పందించని అధికారులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని గ్రామ ముఖద్వారం వద్ద వివేకానంద విగ్రహం పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా మూడు వాణిజ్య షట్టర్ల నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేయకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతుల పేరుతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, అయితే ప్రధాన కూడలిలో వాణిజ్య నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
*వెంటనే స్పందించాలి.. చర్యలు తీసుకోవాలి*
సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
