కడుపు నొప్పితో వస్తే.. కడుపుకోత పెట్టిండు.
••నరేష్ హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన.
••కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మృతి.
••వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ.
సిరిసిల్ల,ప్రజావాణి
కడుపు నొప్పితో వస్తే… కుటుంబానికి కడుపుకోత పెట్టిండని నరేష్ హాస్పిటల్ ముందు మృతి ని బంధువులు ధర్నాకు దిగారు. సిరిసిల్లలోని నరేష్ హాస్పిటల్‌లో వైద్యం వికటించి చికిత్స పొందుతూ తంగళ్లపెల్లి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన కంకణాల ఆంజనేయులు మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
*బంధువులు తెలిపిన వివరాల ప్రకారం*
కంకణాల ఆంజనేయులు సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి కడుపునొప్పితో నరేష్ హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు పరీక్షలు చేస్తూ 2డి ఈఖో చేసి గుండె సమస్యలు ఉన్నట్లు తెలిపి ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు.
చికిత్స కొనసాగుతుండగానే సెప్టెంబర్ 24వ తేదీ ఆంజనేయులు మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. దీంతో వైద్యం వికటించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆంజనేయులు మృతి చెందారని ఆరోపిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మృతుడి భార్య పద్మ, కొడుకులు శివ, అభి కూతురు నందు, సింధు ఉన్నట్లు సమాచారం.జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రిని సీజ్ చేసి, సంబంధిత వైద్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

