*చినూరు వెంకటయ్య మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు – సారంపల్లి వాసుదేవ రెడ్డి*
*బాధిత కుటుంబాలను పరామర్శించిన సీపీఎం నేతలు*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21(ప్రజావాణి):
జిల్లా లోని జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ చినూరు వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీపీఎం నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
చినూరు వెంకటయ్య కుటుంబ సభ్యులను సీపీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, మండల కార్యదర్శి గుండెబోయిన రాజు, జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.డి. షబానా తదితరులు పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ఇదే మండలంలోని దుర్గ్యా తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ మరణించగా వారి సోదరుడైన తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, కామ్రేడ్ వెంకటయ్య సీపీఎం ఉద్యమంతో సుదీర్ఘకాలం అనుబంధం కలిగి, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేశారని అన్నారు. పేదలు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచిన నాయకుడిగా వెంకటయ్య సేవలు గుర్తుండిపోతాయని తెలిపారు.
సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, పేదలు-బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సాగుతున్న పోరాటంలో వెంకటయ్య వంటి నాయకుల సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం సీపీఎంకు మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు.
పార్టీ పట్ల వెంకటయ్యకు ఉన్న నిబద్ధత, ఉద్యమాల పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని, వెంకటయ్య ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై మరింత బలమైన పోరాటాలు నిర్వహించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
వెంకటయ్య కుటుంబ సభ్యులకు సీపీఎం అండగా ఉంటుందని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించేందుకు పార్టీ శ్రేణులు తోడుగా ఉంటారని నాయకులు తెలిపారు.
పరామర్శించిన వారిలో సీపీఎం తమ్మడపల్లి (జి) గ్రామ కార్యదర్శి వేల్పుల రవి, మండల కమిటీ సభ్యులు నక్క యాకయ్య, గ్రామ నాయకులు వడ్లకొండ రాజు, ఎండి శంసొద్దీన్, కే రఘుపతి, నక్క దేవేందర్, కే అంజయ్య, ఎన్ వేణు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

