రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టి హాస్టళ్లలో నరకం – పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం!
• మెయింటెనెన్స్ మాయం – వార్డెన్ల జేబులకు చిల్లు – వంటగదిలోకి వార్డెన్లు – జీతాలు లేక రోడ్డెక్కిన వర్కర్లు
మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆశాదీపంగా నిలవాల్సిన సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నేడు అత్యంత దారుణంగా, దయనీయంగా మారింది. ఉమ్మడి పది జిల్లాల నుండి నేటి 33 జిల్లాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2000కు పైగా హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ నిధులు విడుదల కాకపోవడంతో హాస్టళ్లన్నీ శిథిలావస్థకు చేరుకుని నరకకూపాలుగా మారాయి.
అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూస్తే గుండె తరుక్కుపోతుంది. మహబూబ్ నగర్ నుండి ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుండి నిజామాబాద్ వరకు, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్… ఏ జిల్లాకు వెళ్లినా ఒక్కటే కథ, ఒక్కటే బాధ.కొన్ని హాస్టల్ భవనాలన్నీ పెచ్చులూడిపోయి ఉన్నాయి. గదుల్లో ఫ్యాన్లు తిరగడం లేదు, లైట్లు వెలగడం లేదు, కరెంట్ వైర్లు తెగి వేలాడుతున్నాయి. బాత్ రూమ్ లు, మరుగుదొడ్లు దుర్గంధభరితంగా మారి రోగాలకు నిలయాలుగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మూసుకుపోయి మురుగునీరు గదుల్లోకి వస్తోంది. కుళాయిలు పాడైపోయాయి, నీటి కొరత తీవ్రంగా ఉంది. కనీసం శానిటేషన్ చేయించేందుకు కూడా డబ్బులు లేక హాస్టళ్లు దుర్గంధంతో నిండిపోయాయి. ఫ్యాన్ రిపేర్, కరెంట్ రిపేర్, డ్రైనేజీ బాగు చేయడం లాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్లకు కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు.
ఈ దుస్థితిలో హాస్టల్ వార్డెన్ల పరిస్థితి వర్ణనాతీతం. విద్యార్థులు తమ పిల్లల లాంటి వారని భావించి, వారు ఇబ్బంది పడకూడదనే మంచి మనసుతో వార్డెన్లు తమ సొంత జీతం నుంచే డబ్బులు పెట్టి మెయింటెనెన్స్ చేయిస్తున్నారు. ప్రతి నెలా ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు తమ జేబులోంచి తీసి ఫ్యాన్లు, లైట్లు, డ్రైనేజీలు బాగు చేయిస్తున్నారు. రెండేళ్లుగా ఇలా భరిస్తూ భరిస్తూ వార్డెన్లు ఆర్థికంగా చితికిపోయారు. “ఇంకెంత కాలం మా జీతం డబ్బులతో హాస్టల్ నడపాలి? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు” అని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇక హాస్టళ్లలో పనిచేసే వంట మనుషులు, స్వీపర్లు, వాచ్ మెన్ ల గోడు వింటే మనసు చలించిపోతుంది. వారికి ఆరు నుంచి ఎనిమిది నెలలుగా జీతాలు రాలేదు. జీతాలు రాకపోవడంతో వారు విధులకు రావడం మానేసి చాలా చోట్ల సమ్మె బాట పట్టారు. దీంతో విద్యార్థులు పస్తులు ఉండకూడదనే మానవత్వంతో కొన్ని హాస్టళ్లలో వార్డెన్లే స్వయంగా వంటగదిలోకి వెళ్లి వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్న హృదయ విదారక దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ విద్యా వ్యవస్థకే సిగ్గుచేటు.
తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వర్కర్లు జిల్లా కలెక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వినతి పత్రాలు ఇస్తూ, “జీతాలు ఇవ్వండి మహాప్రభో” అంటూ వేడుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయిస్తారని, తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన వార్డెన్లు, వర్కర్లకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది.
పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం ఉన్న హాస్టళ్లకే నిధులు లేకపోతే ఎలా? ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు, మెయింటెనెన్స్ బిల్లులు విడుదల చేయకపోతే హాస్టల్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా? లేదా అనేది వేచి చూడాలి.

