రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నర్సింలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
పటాన్చెరు, సెప్టెంబర్ 14 (మన ప్రజావాణి):
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామానికి చెందిన నడిమింటి నర్సింలు మాదిగ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం ముంబై జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో నడిమింటి నర్సింలు మాదిగ మృతిచెందారని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
గత రెండేళ్లుగా రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయని, సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పనులను అస్తవ్యస్తంగా నిర్వహించడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారి విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రహదారి పనుల కారణంగా ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మృతిచెందిన నడిమింటి నర్సింలు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గంధగల్ల వీరయ్య మాదిగ, కొలుకుందు మోహన్ మాదిగ, ముబారక్పూర్ గ్రామ సర్పంచ్ నరేష్, కేసారం కృష్ణ, రాములు, వెంకట్‌తో పాటు గ్రామస్తులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

