తీవ్ర డెంగ్యూతో 14 ఏళ్ల బాలుడు మృత్యువుతో పోరాటం
వెంటిలేటర్‌పై మాహీద్.. ఆదుకోవాలని కుటుంబం వేడుకోలు
కోదాడ, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): దేశమంతా విఘ్నాలను తొలగించే గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్న వేళ.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామానికి చెందిన మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు షేక్ ఉద్దండు చిన్న కుమారుడు షేక్ మాహీద్ (14) తీవ్ర డెంగ్యూ జ్వరంతో అనారోగ్యానికి గురై, మెదడుకు సంబంధించిన సమస్య ఏర్పడటంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని బేగంపేట KIMS ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య చికిత్సకు భారీగా ఖర్చు అవుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో ఖరీదైన వైద్య ఖర్చులను భరించడం తమకు సాధ్యం కావడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి చిన్నారి వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక, వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అలాగే మీడియా ప్రతినిధులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, దాతలకు సమాచారం చేరవేసి చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు.
సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన ఫోన్:
షేక్ ఉద్దండు – 9705553919

