గురుకులం ముందు మురుగునీరు,అధికారుల నిర్లక్ష్యం!
•డ్రైనేజీ లేక దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు
•దోమల బెడదతో సీజనల్ వ్యాధుల భయం
•ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?
నేరేడుచర్ల, సెప్టెంబర్ 12 (ప్రజావాణి):
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వద్ద పారిశుద్ధ్య సమస్య అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.హాస్టల్ ముందు సరైన డ్రైనేజీ కాలువ లేక మురుగునీరు నిలిచిపోతుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. విద్యార్థులు,తల్లిదండ్రులు నిత్యం ఇబ్బందులు పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా?
హాస్టల్‌లోనే ఎక్కువ సమయం గడిపే విద్యార్థులు మురుగునీరు, దుర్వాసన, దోమల బెడద మధ్య ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగి విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
తల్లిదండ్రులకు స్వాగతం పలికేది దుర్వాసనే!
హాస్టల్‌లోని తమ పిల్లలను చూసేందుకు వచ్చే తల్లిదండ్రులకు స్వాగతం పలకాల్సిన ప్రదేశంలో మురుగునీరు, దుర్వాసన దర్శనమిస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం, పారిశుద్ధ్యంపై అధికారులు ఎన్నో మాటలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శిస్తున్నారు.
తాత్కాలిక చర్యలు కాదు.. శాశ్వత పరిష్కారం కావాలి
హాస్టల్ ముందు నిలిచిన మురుగునీటిని వెంటనే తొలగించడంతో పాటు, భవిష్యత్తులో మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ కాలువ నిర్మించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు, పంచాయతీ యంత్రాంగం, గురుకుల సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించాలని కోరుతున్నారు.
విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో విఫలమైతే బాధ్యత ఎవరిది? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గురుకులం ముందు మురుగునీరు,అధికారుల నిర్లక్ష్యం!
RELATED ARTICLES

