శాంతిభద్రతల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో ఎల్కతుర్తి నూతన సీఐ విస్తృత పర్యటనలు.
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రతా చర్యలు.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ కే.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు,పర్యటనలు కొనసాగుతున్నాయి. ఎల్కతుర్తి, ముల్కనూర్,వంగర తదితర పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ గ్రామ సర్పంచులు,ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఐ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.వినాయక మండపాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు, నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని,భక్తిశ్రద్ధలతో పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ రాత్రివేళల్లో నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను గుర్తించి వారి వివరాలను పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గ్రామంలో పోలీసుల గస్తీ నిరంతరం కొనసాగిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్కతుర్తి మండలం హన్మకొండ కరీంనగర్,సిద్దిపేట జిల్లాల ప్రాంతాల సరిహద్దులకు సమీపంలో ఉండటంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయని,ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఐ సూచించారు.
ఎల్కతుర్తి మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ,ఎస్ఆర్ఆర్ ఫార్మసీ కాలేజీ,ప్రభుత్వ,ప్రైవేట్ హాస్టళ్లు,లేడీస్ హాస్టళ్లు,రిలయన్స్ గ్యాస్,గ్రానైట్ కంపెనీలు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఉదయం,సాయంత్రం కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు వచ్చే సమయంలో పోలీసుల గస్తీ పెంచి విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగ జరిగేలా పోలీస్ శాఖ తరఫున అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు.ప్రజలు పోలీసులకు సహకరించి వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా,భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

