పోచారం, సెప్టెంబర్ 9: రెడ్డి సామాజిక వర్గంపై అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రెడ్డి సంఘం నాయకులు మేడిపల్లి, పోచారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
సెప్టెంబర్ 5న నకిరేకల్‌లో ముఖ్యమంత్రి సభ సందర్భంగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాలపై మీడియాతో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలోని వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను పెంచి, ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు ఆరోపించారు. ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ మేరకు తెలంగాణ రెడ్డి సంఘం నాయకులు వాకిటి నరసింహారెడ్డి, ఎలిమినేటి సుమన్‌రెడ్డి, బండ విజయరెడ్డి, అంపోజ్వాల శ్రీధర్‌రెడ్డి, పిన్నింటి రణధీర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.

