📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొత్త పెన్షన్ల నాటకం: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున...

స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొత్త పెన్షన్ల నాటకం: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర విమర్శలు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల సెప్టెంబర్ 9 ప్రజావాణి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు అంశాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గడిచిన దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్‌ను కూడా మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వస్తున్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వాల పెన్షన్ల గణాంకాలు:

ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గత ప్రభుత్వాల పెన్షన్ల వివరాలను గణాంకాలతో సహా వివరించారు:

* 2019 నాటికి: చంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే రూ. 2,000 చొప్పున పెన్షన్లు అందేవి.

* 2024 నాటికి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పదవి నుంచి దిగిపోయే నాటికి రికార్డు స్థాయిలో 27 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. దీనితో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 66 లక్షల 35 వేలకు చేరింది. అంతేకాకుండా పెన్షన్ మొత్తాన్ని రూ. 3,000కు పెంచి నిరుపేదలకు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వ హయాంలో: 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం గడిచిన రెండున్నర ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, గతంలో ఇస్తున్న దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లను రద్దు చేసి లబ్ధిదారుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు.

ఎన్నికల హామీల ఉల్లంఘన:

ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 50 సంవత్సరాలు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ పెన్షన్లు ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని నాగార్జున రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి, కేవలం 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. ఇది వృద్ధులను, వెనుకబడిన వర్గాలను దగా చేయడమేనన్నారు.కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం విధించిన దరఖాస్తు గడువు (సెప్టెంబర్ 16, 2026) చాలా తక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వృద్ధులు దరఖాస్తులు సమర్పించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కాబట్టి ఈ కాలపరిమితిని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరంతర ప్రక్రియగా ఉండాలి:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను మంజూరు చేసేవారమని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రెండున్నర ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఎంతో కాలంగా పెన్షన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ నిరాశ కలగకుండా పెన్షన్లు మంజూరు చేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పేదల జీవితాలతో ఆటలాడవద్దని నాగార్జున రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.