వై.ఎస్.ఆర్ కడప జిల్లా..ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 3: పోలీస్ అధికారులు, సిబ్బందికి మెరుగైన పని వాతావరణంతో పాటు, వివిధ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలతో పునరుద్ధరించిన ప్రొద్దుటూరు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం ప్రారంభించారు.మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, ప్రొద్దుటూరు ఏఎస్పీ శ్రీ యు. విబు కృష్ణ, ఐపీఎస్ గారి తో పాటు ప్రొద్దుటూరు సబ్-డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఎస్‌డీపీఓ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, పోలీస్ సేవల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం అందించడమే ఈ పునరుద్ధరణ ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. దాతల సహకారం అభినందనీయం:కార్యాలయ పునరుద్ధరణ పనులకు ప్రొద్దుటూరులోని స్వరూప్ ఐ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ వై.వి. స్వరూప్ కుమార్ రెడ్డి ప్రధానంగా ఆర్థిక సహకారం అందించారు. పోలీస్ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన అందించిన సహకారాన్ని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా కార్యాలయ పునరుద్ధరణకు శ్రీ వి. జయచంద్ర రెడ్డి (CBIT), డాక్టర్ కె.వి.ఆర్. ప్రదీప్ రెడ్డి, డాక్టర్ ఎన్. నాగార్జున యాదవ్, శ్రీ దండపాణి శ్రీనివాసకుమార్, శ్రీ నాగూర్ బాషా (GIT), శ్రీ ఎస్. నాగిరెడ్డి (AGM, SCS), శ్రీ చెన్న శ్రీనివాసులు, శ్రీ కె. గంగిరెడ్డి, శ్రీ పి. మహేశ్వర్ రెడ్డి, శ్రీ పి. రాజేష్ రెడ్డి, శ్రీ ఎం. శంకర్ రెడ్డి తదితరులు ఆర్థిక సహకారం అందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రజలు,ప్రముఖులు, దాతలు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని అన్నారు.సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో పోలీసులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతో పాటు,ప్రజలకు మరింత సమర్థవంతమైన,నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.ప్రధాన దాత డాక్టర్ వై.వి.స్వరూప్ కుమార్ రెడ్డి అందించిన సహకారాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ,కార్యాలయ పునరుద్ధరణకు సహకరించిన ఇతర దాతలు, శ్రేయోభిలాషులందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఏఎస్పీ చొరవతో కార్యాలయానికి ఆధునిక రూపం:ప్రొద్దుటూరు ఏఎస్పీ శ్రీ యు. విబు కృష్ణ,ఐపీఎస్ చొరవతో కార్యాలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాతలు, పోలీస్ అధికారులు,సిబ్బంది సమన్వయంతో కార్యాలయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి ఆధునిక రూపాన్ని కల్పించారు.ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఇటువంటి ప్రజా భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కార్యాలయ పునరుద్ధరణకు సహకరించిన ప్రధాన దాత డాక్టర్ వై.వి. స్వరూప్ కుమార్ రెడ్డితో పాటు, ఇతర దాతలు, శ్రేయోభిలాషులకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, కడప

