📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyఒగ్గుకథ కళారంగంలో ‘ప్రైడ్ ఆఫ్ భారత్’ అవార్డు అందుకున్న పోశాల చంద్రమౌళి గౌడ్

ఒగ్గుకథ కళారంగంలో ‘ప్రైడ్ ఆఫ్ భారత్’ అవార్డు అందుకున్న పోశాల చంద్రమౌళి గౌడ్

📰 Generate e-Paper Clip

టేకుమట్ల/ప్రజావాణి:మూడు దశాబ్దాలుగా ఒగ్గుకథ కళను తన జీవితంలో భాగంగా మలుచుకుని, జానపద కళా వైభవాన్ని సజీవంగా నిలబెడుతూ వస్తున్న టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు పోశాల చంద్రమౌళి గౌడ్ ‘ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషనల్ అవార్డు’ను అందుకున్నారు. ఒగ్గుకథ కళారంగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.గత 30 సంవత్సరాలుగా ఒగ్గుకథ కళాకారుడిగా తనదైన ముద్ర వేసుకున్న చంద్రమౌళి గౌడ్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సైతం ఒగ్గుకథ ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు. సంప్రదాయ జానపద కళకు తన గళంతో జీవం పోస్తూ, పురాణ గాథలు, సామాజిక అంశాలను ఒగ్గుకథ రూపంలో ప్రజలకు చేరవేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒగ్గుకథ కళను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఎందరో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి కొత్త కళాకారులను తీర్చిదిద్దారు. తనకు తెలిసిన కళా మెళకువలను యువతకు నేర్పుతూ, కనుమరుగవుతున్న జానపద కళల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు.మూడు దశాబ్దాల సుదీర్ఘ కళా ప్రస్థానంలో ఒగ్గుకథకు చంద్రమౌళి గౌడ్ అందించిన సేవలకు గుర్తింపుగా లభించిన ‘ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషనల్ అవార్డు’ ఆయన కళా జీవితంలో మరో మైలురాయిగా నిలిచింది. వెలిశాల గ్రామానికి చెందిన కళాకారుడికి అంతర్జాతీయ స్థాయిలో ఈ గౌరవం దక్కడంపై గ్రామస్తులు, జానపద కళాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ పోశాల చంద్రమౌళి గౌడ్‌కు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.