బెజ్జంకి, ఆగస్టు 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ శివారులో ఉన్న సాగునీటి కాలువను అఖిలపక్ష నాయకులు ఆదివారం పరిశీలించారు. బెజ్జంకి మండలం గుగ్గిళ్ల శివారులో నిర్మించిన ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను సాగునీటి కాలువలోకి విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు.
గుగ్గిళ్ల నుంచి బెజ్జంకి ఎక్స్‌రోడ్, గాగిల్లాపూర్, దాచారం మీదుగా తోటపల్లి చెరువులోకి వెళ్లే ఈ సాగునీటి కాలువలోకి వ్యర్థాలు విడుదల చేయడంతో చేపలు, పశువులు మృతి చెందడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయని నాయకులు పేర్కొన్నారు. కాలువలో వ్యర్థాలు ప్రవహించడం వల్ల కాలువ వెంబడి ఉన్న బోరుబావులు, భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గత నెలలో ఇదే కాలువలోకి వ్యర్థాలు విడుదల చేయడంతో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు, బెజ్జంకి బంద్‌ను నిర్వహించి వందలాది మంది ప్రజలతో నిరసన తెలిపామని నాయకులు గుర్తు చేశారు. అప్పట్లో వ్యర్థాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ దౌర్జన్యంగా కాలువలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు.ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అఖిలపక్ష నాయకులు అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన తర్వాతైనా అధికారులు స్పందించరా అని ప్రశ్నించారు.
**వెంటనే చర్యలు తీసుకోవాలి**
ఇరిగేషన్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువలోకి వ్యర్థాల విడుదలను అరికట్టి, ప్రజలకు న్యాయం చేయాలని అఖిలపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి , బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, డీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి లింగాల సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు కోలిపాక రాజు, బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, శేఖర్ బాబు, సీపీఎం నాయకులు సంఘ ఎల్లయ్య, సీపీఐ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

