కౌకొండ పోచమ్మ తల్లి గుడి మాన్యం భూమి వివాదం
పంచాయితీలు జరిగినా కొలిక్కిరాని సమస్య.. భక్తుల ఆవేదన
నడికూడా ప్రజావాణి ఆగస్టు 26
నడికూడ: కౌకొండ గ్రామంలో కొలువైన పోచమ్మ తల్లి ఆలయ మాన్యం భూమి వివాదం రోజురోజుకూ ముదురుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత–భాస్కర్ గ్రావెల్ రోడ్డు వేయించి చర్యలు చేపట్టినప్పటికీ, ఆలయ మాన్యం భూమి విషయంలో మాత్రం సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రైతుకు సర్వే నంబర్ 29/2లో 2 ఎకరాల 16 గుంటలు, సర్వే నంబర్ 25/Aలో 12 గుంటల భూమి ఉన్నట్లు చెబుతున్నారు. 25/Aలో బావి కూడా ఉంది. ప్రస్తుతం 29/2లోని భూమిని సాగు చేస్తున్నారని, దీనికి ఆనుకుని పోచమ్మ తల్లి ఆలయానికి చెందిన సుమారు 30 గుంటలకు పైగా మాన్యం భూమి ఉన్నట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. ఈ భూమిని పూర్వం దొరగారు ఆలయానికి దానంగా ఇచ్చినట్లు వారు చెబుతున్నారు.
పలుమార్లు పంచాయితీలు.. అయినా పరిష్కారం లేదు
ఆలయ మాన్యం భూమిని పరిరక్షించేందుకు గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీలు నిర్వహించి సంబంధిత రైతుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. దీంతో ఆలయానికి బోరు వేయించాలన్న సర్పంచ్ ప్రయత్నాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

మాన్యం భూమి విషయంలో సమస్య కొనసాగుతుండటంతో ఆలయ భక్తులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొంటున్నారు.
రెవెన్యూ అధికారులు స్పందించాలి
ఆలయ మాన్యం భూమిపై నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు భూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలని, ఆలయానికి సంబంధించిన భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

