రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉండి దండగ
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
గోదావరిఖని ఆగస్టు 26 ప్రజావాణి:
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. బుధవారం గోదావరిఖని పట్టణంలోని భాస్కర్ రావు భవన్లో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సాయి ఆజాద్ అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నప్పటికీ విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని మండిపడ్డారు. కేవలం కమిషన్ల కోసమే విద్యాశాఖను సీఎం తన వద్ద పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖకు వెంటనే ప్రత్యేక మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, ₹5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులకు ఓట్లు లేవనే నెపంతో సీఎం చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జేబులు ఖాళీ చేసుకొని కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో నిర్మిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, నాయకులు మామిడిపల్లి హేమంత్, ఎల్కపల్లి సురేష్, లక్ష్మీ ప్రసన్న, తడిగొప్పుల అనూప్ సాయి, అభిషేక్, ఆరే జశ్వంత్, గొడిసెల ప్రణీత్, రాహుల్, సూర్య ప్రకాష్, సాయి, మహి, సాయి శరణ్య తదితరులు పాల్గొన్నారు.

