📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనల్గొండ ఘటనకు నిరసనగా మేడ్చల్‌లో శాంతి ర్యాలీ

నల్గొండ ఘటనకు నిరసనగా మేడ్చల్‌లో శాంతి ర్యాలీ

📰 Generate e-Paper Clip

నల్గొండ ఘటనకు నిరసనగా మేడ్చల్‌లో శాంతి ర్యాలీ

ఉపాధ్యాయుల భద్రత, విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం:టిఆర్ఎస్ఎంఎ

మేడ్చల్, ఆగస్టు 21: నల్గొండ జిల్లాలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం టిఆర్ఎస్ఎంఎ మేడ్చ మండల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ, పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి, రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు ప్రస్తుతం అభద్రతాభావానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడం, అవసరమైనప్పుడు మందలించడం, విద్యార్థుల విద్యా ప్రగతిపై దృష్టి పెట్టడం వంటి విషయాల్లో కూడా ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమన్నారు. ఉపాధ్యాయులకు భద్రత కల్పించడంతో పాటు పాఠశాలల్లో సురక్షిత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలకు ఫోన్ ఇచ్చి వదిలేయకుండా వారు ఏం చూస్తున్నారు, ఎలా వినియోగిస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని అన్నారు. మొబైల్ ఫోన్ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉందన్నారు.

అలాగే పిల్లలపై అతి ప్రేమతో ప్రతి విషయంలోనూ వారిని వెనకేసుకురాకుండా, వారి సమస్యలను అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. పిల్లల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటి వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉండాలని పేర్కొన్నారు.

పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో ఉంటున్నప్పటికీ, ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. విద్యార్థుల ప్రవర్తన, చదువు, అలవాట్లపై పాఠశాల యాజమాన్యంతో తల్లిదండ్రులు నిరంతరం చర్చించాలని సూచించారు. రోజువారీ, వారానికోసారి లేదా నెలకు ఒకసారి నిర్వహించే పేరెంట్-టీచర్ మీటింగ్స్‌ లో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ శాంతి ర్యాలీలో టిఆర్ఎస్ ఏంఏ మేడ్చల్ జిల్లా ట్రెజరర్ గిరిబాబు, మండల జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ, ట్రెజరర్ జిఎల్వి నారాయణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ లవకుమార్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మాథ్యూ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ తదితరులతో పాటు మండలంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.