*కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేయాలి*
*మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ నాయకులు*
మేడ్చల్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మేడ్చల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ నాయకులు ముట్టడించారు.బీఆర్‌ఎస్ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అనుషారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందించాలని కోరారు.
పథకాలను అమలు చేయకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఎల్లంపేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్, బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

