ప్రభుత్వ స్థలాలపై రియల్ కన్ను?
రియల్ ఎస్టేట్ పేరుతో లేఔట్లాంటు పుకార్లు.
అక్రమ లేఔట్లతో ప్రభుత్వానికి గండి.
కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని మేధావుల విజ్ఞప్తి.

కోటగిరి/ప్రజావాణి:-గత కొన్ని నెలలుగా మందగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం తిరిగి ఊపందుకోవడంతో ప్లాట్ల కోసం కొనుగోలుదారుల తాకిడి పెరుగుతోంది.ఇదే అదును గా కొన్ని ప్రాంతాల్లో లేఔట్ల పేరిట పుకార్లు షికార్లు కొడుతు న్నాయి.కొత్తగా ఏర్పడిన మండల కేంద్రాలతో పాటు పట్టణ శివారు ప్రాంతాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రభుత్వ స్థలాలున్న చోట ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేసి నామమాత్రపు అనుమతులతో రెండింటినీ కలిపి లేఔట్‌గా మార్చి విక్రమించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల్లో ఆందోళన…
కష్టపడి సంపాదించిన డబ్బుతో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులు ఈ పుకార్లతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ స్థలాన్ని కూడా కలిపి అమ్మితే రేపు మాకు సమస్యలు వస్తాయేమో నన్న భయం కొనుగోలుదారుల్లో వ్యక్తమవుతుందనే అనుమానాలు లేకపోలేదు.గతంలో నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను విక్రయించిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు గుర్తు చేస్తుకొంటున్నారు.
అధికారుల చర్యలు కోరుతున్న మేధావులు…
ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను వెంటనే గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని.వాటిని ప్రభుత్వ కార్యాల యాల నిర్మాణానికి గానీ,నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం గానీ వినియోగించాలని మేధావులు,సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.ప్రభుత్వ స్థలాలను కాపాడితేనే అక్రమ రియల్ వ్యాపారాలకు అడ్డుకట్ట పడుతుంది.అలాగే కొనుగోలుదారులు కూడా ప్లాట్ కొనేముందు రెవెన్యూ రికార్డులు,లేఔట్ అనుమతులు సరిచూసుకోవాలి అని వారు సూచిస్తున్నారు.అదేవిధంగా అధికారులు మరింతగా చొరవ తీసుకొని ప్రభుత్వ స్థలాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసి ఆ బోర్డులపై ఇది ప్రభుత్వ స్థలం.అక్రమ లేఔట్లు వెయ్యడం,ప్లాట్లను విక్రయించడం చట్టరీత్యా నేరమని బోర్డులో స్పష్టంగా పేర్కొనడం వల్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల సూచన..
ప్లాట్ కొనుగోలు చేసే ముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి,అన్ని రకాల పత్రాలను పరిశీలించిన తర్వాతే ముందు కు వెళ్లాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ప్రజల విజ్ఞప్తి..
అయితే వీటిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు అందకాపోయినా సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను రక్షించి.అక్రమ లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

