ఘట్‌కేసర్, ఆగస్టు 1: ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం సహించబోనని, అవసరమైతే తన సొంత నిధులతోనే కాలనీ అభివృద్ధి పనులు చేపడతానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ‘రేవంత్ అన్న టీం’ సభ్యుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ లక్ష్మీనరసింహ స్వామి కాలనీ వాసులు శనివారం ఎస్‌బీఆర్ ఏసీ కన్వెన్షన్ హాల్‌లో శ్రీకాంత్ రెడ్డిని కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, సీసీ రోడ్లు లేక స్వల్ప వర్షానికే బురద పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిల్వ నీటితో దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలనీవాసుల వినతిపై వెంటనే స్పందించిన శ్రీకాంత్ రెడ్డి సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని, అధికారులు స్పందించకపోతే ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధులతోనే పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన భరోసాతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు…





