*గర్భిణీలకు అందని “స్కానింగ్” సేవలు*
*మాతా శిశు ఆసుపత్రిలో నిరుపయోగంగా లక్షల రూపాయల స్కానింగ్ యంత్రాలు*
*రేడియాలజిస్టు లేక గర్భిణీలకు తీవ్ర ఇబ్బందులు*
*ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలతో పేదలపై ఆర్థిక భారం*
*మన ప్రజావాణి* మంచిర్యాల జులై 17
జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అత్యంత కీలకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.స్వయానా వైద్యులైన రాష్ట్ర మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రేడియాలజిస్టు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్న సమయంలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిరక్షణలో అత్యంత ప్రాధాన్యం కలిగిన స్కానింగ్ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందకపోవడంతో ప్రతిరోజూ వందలాది మంది గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఆధునిక అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిపుణులు లేకపోవడంతో ఆ పరికరాలు వినియోగంలోకి రాక నిరుపయోగంగా మారినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, జైపూర్, చెన్నూర్, నెన్నెల, భీమారం, కోటపల్లి, లక్షేట్టిపేట్, హాజీపూర్ తదితర మండలాల తో పాటు జిల్లాలోని మారుమూల ప్రాంతాల గర్భిణీలు నిత్యం ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా స్కానింగ్ సేవలు లభిస్తాయని ఆశించి వచ్చిన వారికి నిరాశే ఎదురవుతుందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. గర్భిణీలకు స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో ఒక్కోసారి వేల రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీలు, వారి కుటుంబ సభ్యుల వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో తిరిగి వెళ్లి రావడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం తోనే ఇబ్బందులు*
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న నేతల మాటలు నీటి మూటలు లాగానే మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంక్షేమం కొరకు గర్బవతులగా ఉన్న సమయంలో వారికి మెరుగైన వైద్యం అందించాలని, సుఖ ప్రసవాలు, తల్లి, బిడ్డల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా మాతా శిశు ఆసుపత్రులను నిర్మించినప్పటికి, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేదనే చందంగా అన్ని పరికరాలు ఉన్నప్పటికీ నిపుణులు లేక వైద్య సేవలు అందకపోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు.
గర్భస్థ శిశువు ఎదుగుదల, గుండె స్పందన, అవయవాల అభివృద్ధి, తల్లి ఆరోగ్య పరిస్థితి, గర్భంలోని నీటి పరిమాణం వంటి కీలక అంశాలను తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అత్యంత అవసరం. ప్రతి దశలో వైద్యులు సూచించిన సమయానికి స్కానింగ్ చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించి, తల్లి బిడ్డల క్షేమానికి తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అలాంటి అత్యవసర సేవ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ఆధునిక స్కానింగ్ యంత్రాలు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, వాటిని నిర్వహించే నిపుణులైన రేడియాలజిస్టులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. ప్రభుత్వం లక్షల రూపాయలు ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలు ప్రజలకు ఉపయోగపడకుండా, వృథావుతుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
*ప్రజలపై ప్రైవేట్ భారం…*
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లభించాల్సిన సేవలు అందకపోవడంతో గర్భిణీలు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు ఒక్కో స్కానింగ్ కు వందల నుంచి వేల రూపాయల వరకు వసూలు చేస్తుండటంతో ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు ఇది తీవ్రమైన భారంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. గర్భస్థ సమయంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్కానింగ్ అవసరం అవుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల చికిత్స ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సమయం వృథా కావడంతో పాటు గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
*ఆసుపత్రి నిర్వహణలో జిల్లా యంత్రాంగం విఫలం*
ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా పాలనా అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షణ అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు సర్వత్ర వ్యక్తం అవుతుండగా, ఆసుపత్రి నిర్వహణపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో రేడియాలజిస్టు లేకపోవడం వల్ల గర్భిణీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వెంటనే పరిష్కారం చూపించాల్సిన బాధ్యత గల అధికారులు ఆ దిశగా సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ప్రతిరోజూ వందలాది మంది గర్భిణీలు స్కానింగ్ సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వారికి సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, రేడియాలజిస్టు నియామకంపై నిరంతరంగా ఉన్నతాధికారులతో సమన్వయం చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయ బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారులు ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలని పలువురు కోరుతున్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీ మహిళలకు నిర్ణీత వ్యవధిలో స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం వల్ల శిశువు ఎదుగుదలలో లోపాలు, గర్భాశయ సమస్యలు, తల్లి ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుందని, అలాంటి సేవలు ఆలస్యమైతే తల్లి, శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి, మాతా శిశు ఆసుపత్రికి శాశ్వత రేడియాలజిస్టును నియమించి, ఇప్పటికే ఉన్న స్కానింగ్ పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే డిమాండ్ ప్రజల నుండి వ్యక్తం అవుతుంది. అంతా వరకు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక ప్రాతిపదికన ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి రేడియాలజిస్టును డిప్యుటేషన్‌పై నియమించి, గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో నెలకొన్న ఈ సమస్యకు యుద్ధప్రాతిపదికన పరిష్కారం చూపించాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పరికరాలు, ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుని, గర్భిణీలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం.
*సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను*
*మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారిని డాక్టర్ అరుణశ్రీ*
ఈ విషయమై మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారిని డాక్టర్ అరుణశ్రీ ని ఫోన్లో సంప్రదించగా ఆమె మాట్లాడుతూ, గతంలో పనిచేసిన రేడియోలాజిస్టులు బదిలీపై వెళ్లగా, మరొక రేడియోలాజిస్ట్ ప్రసూతి సెలవులో వెళ్లనుండటం, ఆసుపత్రిలో సూపరింటెండెంట్ పోస్ట్ సైతం ఖాళీగా ఉండటంతో సమస్య తలెత్తిందని, సంబంధిత అధికారులను సంప్రదించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.





