పోచారం, జూలై 15: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పోచారం డివిజన్-8 పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ఇంటింటి సర్వే అవగాహన కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు కొమ్ముల ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, రాజీవ్ గృహకల్పలోని 354 నుంచి 361 వరకు ఉన్న ఎనిమిది పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రజలకు ఎస్ఐఆర్ సర్వే ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బోయపల్లి కొండల్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైందని అన్నారు. సర్వే నిర్వహిస్తున్న అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడంలో సహకరించాలని సూచించారు. నింపిన ఫారాలను సకాలంలో బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని, ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అబ్బవతిని నర్సింహా, నానావత్ జితేందర్, కేఎం రెడ్డి, చక్రపాణి, యాదగిరి ముదిరాజ్, మల్లికార్జున్, దుర్గయ్య, శ్రీనివాస్, మధు, కృష్ణమూర్తి తదితర నాయకులతో పాటు పోచారం డివిజన్ ఎస్ఐఆర్ పర్యవేక్షకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




