జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 16(ప్రజావాణి):
వరంగల్ లోని చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల ధూప దీప నైవేద్య (డిడిఎన్) అర్చకుల ప్రాంతీయ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, ఖమ్మం తదితర జిల్లాల నుండి అర్చకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి వెల్గటూర్, ఎండపల్లి మండలాల అధ్యక్షులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులందరూ ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. అర్చకుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అర్చక ప్రముఖులను నెల రోజుల్లోగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి, వారితో మాట్లాడించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునేలా, అర్చకులకు పూర్తి రక్షణ కల్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. “అర్చకుల గౌరవానికి, భద్రతకు భంగం వాటిల్లితే ప్రభుత్వం ఊరుకోదని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అర్చక లోకానికి పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ధూప దీప అర్చక కన్వీనర్లు నాగరాజు, మహేంద్ర చారి, రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు శ్రీకాంతాచారి ముఖ్య అతిథులుగా పాల్గొని అర్చకుల ఐక్యతను చాటారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన అర్చక ప్రతినిధులు ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.



