•ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బీరంగూడ గుట్ట మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
*అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు
*పట్నం సునీత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు
అమీన్పూర్, జూలై 13 (ప్రజావాణి):సోమవారం ఆరుద్ర నక్షత్రం కావడంతో రెండో శ్రీశైలంగా పేరుగాంచిన బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం రావడం అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ అర్చకులు ప్రహ్లాద్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ నిరంతరంగా అభిషేకాలు జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పరమశివుడికి అభిషేకం చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు భారీగా తరలివచ్చారని తెలిపారు. ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.1 లక్ష విరాళం అందించడం అభినందనీయమన్నారు. ధర్మకర్తల మండలి, దేవాదాయ శాఖ అధికారుల సమన్వయంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ కూడా స్వామివారిని దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.




