పోరుమామిళ్ల, జూలై 10:ప్రజావాణి పట్టణంలో వైష్ణవి ప్రైవేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని అతివేగంగా దూసుకొచ్చిన శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు గురువారం పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించింది. స్కూల్ యాజమాన్యం మరియు డ్రైవర్ యొక్క బాధ్యతారాహిత్యం కారణంగా ఓ ఆర్మీ జవాన్ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అత్యంత దౌర్భాగ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు (నెంబర్ 6) పట్టణంలోని విద్యార్థులను ఎక్కించుకుని అతి లోడుతో వస్తోంది. బస్సు నిండా సామర్థ్యానికి మించి పిల్లలను గొర్రెల మందలా కుక్కారు. ఈ క్రమంలో స్థానిక స్టేట్ బ్యాంక్ (SBI) ఎదురుగా ఉన్న రోడ్డుపైకి రాగానే, అతివేగంగా ఉన్న బస్సు ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ తప్పింది.అదే సమయంలో అక్కడ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆర్మీ జవాన్‌ను ఈ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు ఆయనకు తీవ్ర రక్తస్రావమై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడైన జవాన్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం కేవలం ఫీజుల వసూళ్లపైనే శ్రద్ధ పెడుతోందని, విద్యార్థుల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడుతున్నారు.
ప్రధాన ఆరోపణలు: అధిక లోడింగ్: బస్సు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవడం వల్లనే వాహనం కంట్రోల్ తప్పిందని స్థానికులు చెబుతున్నారు: ప్రమాదానికి గురైన వాహనానికి ఎటువంటి సరైన ఫిట్‌నెస్ పర్మిషన్లు, రవాణా శాఖ నిబంధనల అనుమతులు లేవని, అయినా కూడా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలు అందించే ఒక ఆర్మీ జవాన్. ఇలా ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యానికి బలికావడం అత్యంత విచారకరమని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న చిన్నారి విద్యార్థులు కూడా తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఒకవేళ బస్సు గనుక బోల్తా పడి ఉంటే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు వణికిపోతున్నారు.ఈ దౌర్భాగ్యమైన చర్యకు కారణమైన శ్రీ వైష్ణవి స్కూల్ యాజమాన్యంపై, అలాగే నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌పై రవాణా శాఖ మరియు పోలీస్ అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.అలాగే పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల వాహనాల పర్మిషన్లను, ఫిట్‌నెస్‌ను తక్షణమే తనిఖీ చేయాలని కోరుతున్నారు.




