మన బడి – మన పిల్లలు – మన భవిష్యత్తు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆవగాహన సమావేశం నడి కూడా జులై 03( ప్రజావాణి)
కౌకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞాన ప్రసన్నాంబ ప్రీస్కూల్ హెడ్మాస్టర్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఓదెల శ్రీలత ఉప సర్పంచ్ ముక్కెర రాజు శరత్ పేర్వాల లింగాల తిరుపతి మేకల కుమారస్వామి వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ “మన బడి – మన పిల్లలు – మన భవిష్యత్తు” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా సదుపాయాలు వంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, రవాణా ఖర్చులు, ఇతర అదనపు భారం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్న అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు.
గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల వ్యాన్ల ద్వారా పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపడం కంటే, గ్రామ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించడం ద్వారా పాఠశాల అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం అయితే గ్రామ భవిష్యత్తు కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యను ఆదరించాలని, “మన బడి అభివృద్ధి – మన పిల్లల అభివృద్ధి – మన గ్రామ అభివృద్ధి” అనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని గ్రామ ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
“ప్రభుత్వ బడి గొప్ప బడి – మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట.”
“మన బడి… మన పిల్లలు… మన బాధ్యత.”




