పెన్నా గర్భం గుల్ల.కల్లూరు ఇసుకపై ‘లారీల’ కన్ను!
గార్లదిన్నె మండలం కల్లూరు పెన్నా నది నుండి యథేచ్ఛగా ఇసుక తరలింపు!
స్థానిక అవసరాలు దాటి అనంతపురం,కర్నూలు సుదూర ప్రాంతాలకు అక్రమ రవాణా!
పగలు,రాత్రి తేడా లేకుండా గర్జిస్తున్న లారీలు,ట్రాక్టర్లు.నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!
అనంతపురం జిల్లా (ప్రజావాణి జూన్ 27) గార్లదిన్నె మండలం పరిధిలోని కల్లూరు పెన్నా నది ఇసుక దందాకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.నదీ గర్భం నుండి విలువైన సహజ వనరులను విచ్చలవిడిగా దోచేస్తూ.పర్యావరణాన్ని నిలువునా ముంచేస్తున్నారు.కల్లూరు పెన్నా నది ప్రాంతం నుంచి స్థానిక అవసరాల పేరిట మొదలైన ఈ ఇసుక తోలకాలు,ఇప్పుడు రూటు మార్చి ఏకంగా అనంతపురం,కర్నూలు బెంగళూరు,వంటి సుదూర ప్రాంతాలకు లారీలు,భారీ వాహనాల ద్వారా యథేచ్ఛగా తరలిపోతున్నాయి.
పగలు,రాత్రి తేడా లేకుండా రవాణా:
స్థానికంగా ఉన్న ఇసుక రేవుల నుంచి పగలు,రాత్రి అనే తేడా లేకుండా వందలాది లారీలు,ట్రాక్టర్లు ఇసుకను నింపుకొని రహదారులపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి.ఎటువంటి పక్కా అనుమతులు లేకుండా,నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ రవాణా సాగుతున్నట్లు స్పష్టమైన ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల నిఘా లోపం,స్థానిక యంత్రాంగం ఉదాసీనత వల్లే ఇసుక మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు. రోడ్లు ధ్వంసం:
పెన్నా నది పరివాహక ప్రాంతంలో జరగుతున్న ఈ విచ్చలవిడి ఇసుక తవ్వకాల వల్ల కల్లూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు,టన్నుల కొద్దీ బరువైన ఇసుక లోడుతో ప్రయాణిస్తున్న భారీ లారీల వల్ల గార్లదిన్నె పరిసరాల్లోని గ్రామీణ రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారి ధ్వంసమవుతున్నాయి. దీనివల్ల నిత్యం ప్రయాణించే వాహనదారులు,ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,ప్రమాదాల బారిన పడుతున్నారు.
అధికారులు ఎటు చూస్తున్నారు?
కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున ఇసుక కర్నూలు,అనంతపురం,బెంగళూరు వరకు నగరాలకు తరలిపోతున్నా,మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఏదైనా చిన్న ట్రాక్టర్ కనిపిస్తే సీజ్ చేసే అధికారులు,లారీల కొద్దీ సుదూర ప్రాంతాలకు తరలుతున్న పెద్ద నెట్‌వర్క్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్,మైనింగ్ ఉన్నతాధికారులు స్పందించి కల్లూరు పెన్నా నదిలో సాగుతున్న ఈ ఇసుక దోపిడీపై కఠినమైన నిఘా పెట్టాలని,అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు,పర్యావరణ కులు డిమాండ్ చేస్తున్నారు.



