బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా దళిత మహిళపై జరిగినట్లు ఆరోపిస్తున్న కుల వివక్ష దాడిని ఖండిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బోనగిరి రూపేష్, మాల మహానాడు మండల అధ్యక్షుడు సంగెం రూపేష్ మాట్లాడుతూ, ఆలయంలోకి దళిత మహిళలను అడ్డుకోవడం, కులం పేరుతో దూషించి దాడి చేయడం అత్యంత అమానవీయమని ఖండించారు. రాజకీయ స్వార్థాల కోసం కొందరు ఎస్సీ, బీసీ వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళితులు, వెనుకబడిన వర్గాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్‌కు పంపాలని, లేదంటే ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా నాయకులు చింతకింది పరశురాములు, మాంకాల బాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి మోదుంపల్లి రాజు, కోశాధికారి బోనగిరి ప్రభాకర్, పెరికబండ గ్రామశాఖ అధ్యక్షుడు కొంపెల్లి మల్లేశం, సుమన్, స్వేరో మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చిలుముల మోహన్, ఉప్పులేటి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



