ఇస్నాపూర్ వరకు మెట్రో విస్తరించాలి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సత్తన్న వినతి
పటాన్‌చెరు, జూన్ 27(ప్రజావాణి):హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2లో మియాపూర్ నుంచి పటాన్‌చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించాలని కోరుతూ మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే సత్తన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి శనివారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సత్తన్న మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. గతంలో మియాపూర్–పటాన్‌చెరు–ఇస్నాపూర్ వరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా, ప్రస్తుతం ఐక్రిసాట్ వరకు మాత్రమే ప్రతిపాదించడం వల్ల పటాన్‌చెరు, ఇస్నాపూర్, పరిసర ప్రాంతాల ప్రజలకు పూర్తి ప్రయోజనం చేకూరదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.పటాన్‌చెరు–పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం, ఐఐటీ హైదరాబాద్, గీతం యూనివర్సిటీతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను ఇస్నాపూర్ వరకు విస్తరించడం అవసరమని పేర్కొన్నారు. ఈ మార్గం అమలులోకి వస్తే కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సంగారెడ్డి, జహీరాబాద్, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని, జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం కూడా తగ్గుతాయని వివరించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మియాపూర్–పటాన్‌చెరు–ఇస్నాపూర్ మెట్రో కారిడార్‌ను హైదరాబాద్ మెట్రో ఫేజ్–2లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని సత్తన్న కోరారు.ఈ కార్యక్రమంలో మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక సభ్యులు రుద్రారం శంకర్, మెట్టు శ్రీధర్, సురేందర్, సాయితేజ పాల్గొన్నారు.


