•విద్యుత్‌నగర్ నీటి సమస్యల పరిష్కారానికి అధికారులతో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి చర్చలు
భారతీనగర్, జూన్ 19 (ప్రజావాణి): భారతీనగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీలో తాగునీటి సరఫరా లోపాలు, బోర్‌వాటర్ మరియు మంజీరా నీటి పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్‌నగర్ కాలనీ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో, నీటి సరఫరా వ్యవస్థలను హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అమీన్‌పూర్ సర్కిల్‌కు అప్పగించి ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
అలాగే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్తో సమన్వయం చేసుకొని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా భారతీనగర్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై కూడా జోనల్ కమిషనర్‌తో చర్చించిన సింధు ఆదర్శ్ రెడ్డి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులతో సమన్వయం కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి స్పష్టం చేశారు.





