ఘట్కేసర్, జూన్ 14: ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న 270వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుంధతీ యువజన సంఘం మర్పల్లిగూడ అధ్యక్షుడు చిలుగురి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు చిలుకూరి నిఖిల్, కార్యదర్శి ఈడుగళ్ల అశోక్ హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చిలుగురి శ్రీకాంత్ మాట్లాడుతూ, “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించకపోయి ఉంటే దేశం చాతుర్వర్ణ వ్యవస్థ, మతోన్మాదం, కుల వివక్షలతో మరో 5000 సంవత్సరాలు వెనుకబడిపోయేది. అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
అనంతరం సంత్ కబీర్ దాస్ 628వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంత్ కబీర్ దాస్ సందేశాలను స్మరించుకుంటూ, “మనిషిని అతని కులంతో కాదు, గుణంతో కొలవాలి. మతం ప్రేమను నేర్పాలి కానీ ఆధిపత్యాన్ని కాదు. దేవుని ముందు అందరూ సమానులే” అనే కబీర్ బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కట్కూరి నర్సింగ్ రావు (అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం, ఘట్కేసర్ మున్సిపాలిటీ), బండారి రాందాస్ (అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ), నర్సింగ్ రావు, సి. వంశీ, సి. ఆనంద్, యెల్లేష్, సి. నిఖిల్, ఈ. విష్ణు, ప్రవీణ్, జె. అఖిల్, శివకృష్ణ, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


