📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyరైతుల ముంగిటకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్

రైతుల ముంగిటకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్

📰 Generate e-Paper Clip

*రైతుల ముంగిటకు ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’*

*ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం*

*వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్*

*షాద్‌నగర్ లో ఎరువుల దుకాణాల తనిఖీ* 
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 13:
రైతులు ఎరువుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రాఘవేంద్ర ఫర్టిలైజర్ తదితర షాపులను ఆయన పరిశీలించి తనిఖీ చేశారు. అదేవిధంగా నందిగామ మండలంలో ఆయన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ యాప్ పనితీరును, డీలర్ షాపుల వద్ద అమలవుతున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ తనిఖీ చేశారు.
నిన్న వ్యవసాయ శాఖ అధికారులతో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సందర్భంగా ప్రస్తావించిన పలు సమస్యలను గుర్తించి అధికారులు మరుసటి రోజు శనివారం రంగంలోకి దిగడం విశేషం. ఈ సందర్భంగా అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గత డిసెంబర్‌లో రైతులు ఎరువులు కొనుగోలు చేయడానికి గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాయడం, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, బలవంతంగా ఇతర వస్తువులను అంటగట్టడం వంటి సమస్యలు అనేకం తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా ఎరువులను బుక్ చేసుకోవచ్చని, దీనివల్ల సమయం ఆదాతో పాటు పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాథమికంగా ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్యలకు తక్షణ పరిష్కారాలు యాప్ అమలులో వస్తున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.

*ఓటీపీ విధానం*

కొనుగోలు సమయంలో కొందరు రైతుల వేలిముద్రలు పడక తలెత్తుతున్న ఇబ్బందులను గమనించి, వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, దీంతో వేలిముద్రల స్థానంలో ఓటీపీ ద్వారా ఎరువులు కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

*అదే రోజు కొనుగోలు:*

గతంలో యాప్‌లో ఎరువులు బుక్ చేసుకున్న రెండు రోజుల తర్వాత కొనుగోలు చేయాలన్న నిబంధన ఉండేది. కానీ, రైతుల విజ్ఞప్తి మేరకు ఇప్పుడు బుక్ చేసుకున్న రోజే ఎరువులు పొందే వెసులుబాటు కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు.

*కంట్రోల్ రూమ్ ఏర్పాటు*

యాప్‌లో స్టాక్ కనిపించకపోవడం, వ్యవసాయ విస్తీర్ణం (హెక్టార్లు/ఎకరాలు) నమోదులో వస్తున్న వ్యత్యాసాలు వంటి లోపాలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోందని, డీలర్లు లేదా రైతుల నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామానికో ముగ్గురు వాలంటీర్లు రైతులకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామానికి ముగ్గురు ‘సాయిల్ హెల్త్ వాలంటీర్ల’ను ప్రభుత్వం నియమించిందని విజయ్ కుమార్ తెలిపారు. వీరు గ్రామాల్లో మట్టి నమూనాలను పరీక్షించి తగిన ఎరువుల వాడకంపై రైతులకు సూచనలు ఇస్తారని, అలాగే స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు లేదా యాప్ వాడకం తెలియని వారికి ఎరువులు బుక్ చేయడంలో ఉచితంగా సహాయపడతారని వివరించారు. పూర్తి స్థాయిలో ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎరువుల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిణి (DAO) శైలజ, వ్యవసాయ శాఖ ఏడీఎస్‌లు (ADS) సత్యం బాబు, మాధవి, షాద్‌నగర్ ఏడీ రమాదేవితో పాటు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర ఏడీఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular