📄 ePaper
Sunday, June 7, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అడుగడుగునా గోతులు... అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు.రోడ్లా? చెరువులా

అడుగడుగునా గోతులు… అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు.రోడ్లా? చెరువులా

📰 Generate e-Paper Clip

ప్రయాణికుల నరకయాతన.గుంతలమయం. ప్రయాణం ప్రమాదకరం!

!మృత్యుకుహరాలుగా మారిన రహదారులు.పాలకులు మారినా..మారని రోడ్ల రాత

!వాహనదారులారా చూసి పొండి… ఇది రహదారి కాదు, గుంతల దారి!

కాశినాయన జూన్ 7 ప్రజావాణి మండలం,ఓబులాపురం నుంచి నరసాపురం వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి యమలోకానికి దారి,ఆ రహదారిపై ప్రయాణించడమంటే సాక్షాత్తూ యమలోకానికి ప్రయాణమైనట్లే.అడుగడుగునా మృత్యుకుహరాలు, గజానికో గుంత.ఏ క్షణంలో ఏ వాహనం అదుపుతప్పి ఏ ప్రాణం గాల్లో కలిసిపోతుందో తెలియని దయనీయ స్థితి.ఇది ఎక్కడో కాదు కడప జిల్లా కాశినాయన మండలంలోని ఓబులాపురం నుంచి నరసాపురం వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి.గత కొంతకాలంగా ఈ రోడ్డు పూర్తిగా నాసిరకంగా మారి,రాకపోకలు సాగించే ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమించింది గుంతలమయమైన ఈ రహదారిపై నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.చిన్నపాటి గాయాలతో కొందరు బయటపడుతుంటే,మరికొందరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇళ్లకు పెద్ద దిక్కుగా ఉన్నవారు సైతం ప్రమాదాల బారిన పడి, నడవలేని స్థితిలో మంచానికే పరిమితమవుతున్న ఉదంతాలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి.ఈ దారుణమైన రహదారి గుండానే నిత్యం ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు తమ ఏసీ కార్లలో రయ్యిరయ్యింటూ ప్రయాణిస్తున్నా, సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం తమను ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని,కనీసం ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈ నరకకూపానికి మోక్షం కల్పిస్తుందని ఆశించామని,కానీ పాలకుల తీరులో మార్పు రాలేదని ప్రయాణికులు నిట్టూరుస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇచ్చే హామీలు,గెలిచిన తర్వాత నీటి మూటలుగా మారుతున్నాయని ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు.విశేషమేమిటంటే,ఈ రహదారి ప్రాంతంలోనే ప్రసిద్ధిగాంచిన జ్యోతి క్షేత్రం ఉంది. నిత్యం వందలాది వాహనాల్లో భక్తులు,ప్రయాణికులు స్వామివారి దర్శనార్థం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు.ఎంతో పవిత్ర భావంతో,ప్రశాంతత కోసం క్షేత్రానికి వచ్చే భక్తులు.ఈ గుంతల రోడ్డుపై పడే నరకయాతనకు తీవ్ర అసహనానికి,భయాందోళనకు గురవుతున్నారు.ఈ రోడ్డుపై ప్రయాణించి సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటే చాలని దేవుడికి దండం పెట్టుకునే పరిస్థితి నెలకొంది.రోడ్డు నాణ్యత లోపించడం వల్లే ఇలాంటి దుస్థితి దాపురించిందని,గుంతల రోడ్డు వల్ల పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే అధికారులు మేల్కొని మరమ్మతులు చేపడతారా అని భక్తులు,ప్రయాణికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు,పాలకులు కుంభకర్ణ నిద్ర వీడి,యుద్ధప్రాతిపదికన ఈ రోడ్డుకు తూతూమంత్రంగా ప్యాచ్ వర్కులు చేయకుండా,శాశ్వత ప్రాతిపదికన నాణ్యమైన రహదారిని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజాధనంతో వేసిన రోడ్లు కేవలం కొన్ని నెలల్లోనే పాడవడానికి కారణమైన కాంట్రాక్టర్లపై,పర్యవేక్షణ లోపించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీతనం నిలపాలని కోరుతున్నారు.ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోయాక,లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు,ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ కనీస బాధ్యత అని ప్రజలు గుర్తు చేస్తున్నారు.ఇకనైనా పాలకులు,ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపడతారా లేక మరిన్ని ప్రాణాలు బలిగోడానికి ఎదురుచూస్తారా అనేది వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular