కమ్యూనిస్టుల పురోగమనమే సమాజానికి రక్ష
-అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదు
-సిపిఐ జనరల్ బాడీ సమావేశంలో కూనంనేని
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
మారుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సమాజానికి కమ్యూనిస్టులే రక్ష అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. భారతదేశం ఒక సంక్లిష్ట స్థితిని -ఎదుర్కొంటుందని కార్పొరేట్ల వద్ద సంపద పొగుపడుతుందని హక్కులు హరించబడుతున్నాయని ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ బోనకల్ మండల జనరల్ బాడీ సమావేశం శుక్రవారం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ ఏలూరి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్టుల -పురోగమనం తథ్యమన్నారు. మోడీ అవకాశవాద కార్పొరేట్ అనుకూల పాలన సాగిస్తున్నారని కూనంనేని తెలిపారు. మోడీ, -అమిత్ షా లేదా ఇతర బిజెపి నాయకులు కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టుల పైనే ఎక్కువగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా బిజెపి రాజకీయ లబ్ది పొందుతుంది తప్ప బిజెపి పాలన పట్ల ప్రజల్లో సానుకూలత లేదన్నారు. ఏ ఒక్క హామీని మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో నిలబెట్టుకోలేదన్నారు. నల్ల ధనం రప్పించడం, రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో నగదు జమ ఇలా ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోక పోగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల పట్ల వివక్షాపూరిత ధోరణి అవలంభిస్తుందని కూనంనేని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం సిపిఐ పోరాడుతుందన్నారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన -డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలకు తావులేదని ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టడం ద్వారా -లబ్ది పొందాలనుకునే వారికి సిపిఐ తగు రీతిలో సమాధానం చెబుతుందని కూనంనేని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కాదు కదా వాడి జేజమ్మ సైతం కమ్యూనిస్టులను అంతం చేయలేరని కూనంనేని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం -పోరాడతామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ బలానికి అనుగుణంగా పోటీ చేయాలని ఆయన సూచించారు. చారిత్రిక నేపథ్యం కలిగిన గ్రామాలైన బ్రాహ్మణపల్లి, కలకోట, రాపల్లి, రాయన్నపేట, మోటమర్రి తదితర గ్రామాల్లో సిపిఐకి ప్రాతినిథ్యం ఉండేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశానికి ముందు సిపిఐ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పారుపల్లి రాఘవయ్య ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ, ఎన్ఎఫ్ఎడబ్ల్యూ అధ్యక్షురాలు బత్తినేని నీరజ, మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుము రోషన్ కుమార్, జక్కుల రామారావు, మండల నాయకులు పారుపల్లి -నర్సింహారావు, నాగేశ్వరరావు, వంగల నర్సింహా, కొంగర కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.






