అణగారిన వర్గాల గొంతుక మూగబోయింది.. బోయిని చంద్రమౌళి కన్నుమూత
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):
దళిత, బహుజన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, విద్యా చైతన్యం కోసం జీవితాంతం పోరాడిన ప్రగతిశీల బహుజన విద్యార్థి ఉద్యమ నేత బోయిని చంద్రమౌళి మృతి పట్ల పలువురు ఉద్యమకారులు, మేధావులు, విద్యావేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువుతోనే సామాజిక చైతన్యం, సమానత్వం సాధ్యమని విశ్వసించి అనేక మంది యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన చంద్రమౌళి మరణం బహుజన ఉద్యమానికి తీరని లోటని భారత నాస్తిక సంఘం జాతీయ అధ్యక్షుడు జీడీ సారయ్య పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బోయిని చంద్రమౌళి మంగళవారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం నవాబుపేటకు తరలించగా, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉద్యమకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తుది నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గడ్డం సదన్ కుమార్తో పాటు పలువురు అంబేద్కర్వాదులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాల నాయకులు ఆయన భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బహుజన సమాజ అభ్యున్నతికి చంద్రమౌళి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
బోయిని చంద్రమౌళి జీవితం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. 1978లో గ్రామంలోని ఓ దేవాలయంలో ప్రవేశించాడనే కారణంతో కొందరు అగ్రకులస్తులు ఆయనను అవమానించి, దాడికి యత్నించారు. ఆ పరిస్థితుల్లో గ్రామాన్ని విడిచి వెళ్లినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. విద్యనే తన ఆయుధంగా ఎంచుకుని ఉన్నత చదువులు అభ్యసించారు. అనంతరం వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేసి సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అంకితభావంతో కృషి చేసిన చంద్రమౌళి, గన్నుతో కాదు పెన్నుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల్లో, బహుజన ఉద్యమాల్లో కీలక నాయకుడిగా ఎదిగి అనేక మంది దళిత, బహుజన యువతలో చైతన్యం నింపారు. విద్య, స్వాభిమానం, సామాజిక హక్కులపై అవగాహన కల్పిస్తూ కొత్త తరానికి మార్గదర్శకుడిగా నిలిచారు.
తన మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ ఆసుపత్రికి నేత్రదానం చేయడం ఆయన మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. జీవించి ఉన్నంతకాలం సమాజం కోసం పనిచేసిన ఆయన, మరణానంతరం కూడా మరొకరికి వెలుగునిచ్చే గొప్ప నిర్ణయం తీసుకోవడం పలువురిని కదిలించింది.
చంద్రమౌళి మృతి వార్త తెలిసిన వెంటనే వివిధ ప్రాంతాల నుంచి విద్యావేత్తలు, ఉద్యోగులు, అంబేద్కర్వాదులు, ఉద్యమకారులు, బహుజన సంఘాల నాయకులు నవాబుపేటకు చేరుకుని నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ బహుజన సమాజ అభ్యున్నతికి చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల గొంతుక మూగబోయింది.. బోయిని చంద్రమౌళి కన్నుమూత
RELATED ARTICLES




