మన ప్రజావాణి ప్రతినిధి(చిగురుమామిడి): తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజానాట్యమండలి 26వ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు.ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమ్మయ్య, కళారంగంలో మరియు ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ గుర్తింపు పొందారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, తనకు సహకరించిన సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులు, కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.
సమ్మయ్య ఎన్నిక పట్ల సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని అశోక్, బోయిని పటేల్, మండల కొమురయ్య, విలాసాగరం అంజయ్య, తమ్మిశెట్టి రవీందర్, నీల వెంకన్న తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రజానాట్యమండలి కార్యకలాపాల అభివృద్ధికి సమ్మయ్య సేవలు మరింత ఉపయోగపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా దుడ్డేల సమ్మయ్య ఎన్నిక
RELATED ARTICLES

