బెజ్జంకి, మే 26 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిద్దిపేట రూరల్ సర్కిల్ సీఐ చి. విద్యాసాగర్, బెజ్జంకి ఎస్ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ వివాదాలు, భూ తగాదాలు, దాడులు, బెదిరింపులు, జూదం, మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, మహిళలను వేధించడం వంటి సంఘ వ్యతిరేక చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు.పాత నేర ప్రవర్తనలను విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి సక్రమ మార్గంలో జీవించాలని సూచించిన పోలీసులు, గ్రామాల్లో అనుమానాస్పద సంఘటనలు కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ, బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.బెజ్జంకి ఎస్సై తిరుపతి మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.బెజ్జంకి ,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


