తిరుపతి ప్రజావాణి న్యూస్) గంజాయి మాదకద్రవ్యాలను నిషేధించాలంటూ టీడీపీ నిరసన ఈ నేపథ్యంలో పరస్పర ఆందోళనలు పిలుపునిచ్చిన కూటమి, వైసీపీ నేతలు పార్టీ నినాదాలతో హడావిడి పోలీస్ స్టేషన్లో పరస్సర ఫిర్యాదులు తిరుపతిలో శనివారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియా పోస్టులు, గంజాయికేసు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి.ఒకవైపు మహిళలను కించపరిచే పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయగా, మరోవైపు గంజాయి వ్యవహారంలో వైసీపీ కార్యకర్తల పాత్రపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నినాదాలు, పరస్పర విమర్శలతో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.మహిళలపై అనుచిత వ్యాఖ్యలు టీడీపీ నాయకుడు జేబీ శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు మాచర్ల రఘురాం సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టారంటూ వైసీపీ నేతలు తిరుపతిలో ఆందోళన చేపట్టారు.ముఖ్యంగా వైసీపీ మహిళా నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టులు, కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు జేబీ శ్రీనివాస్ అనుచరుడు మాచర్ల రఘురాం ఈ పోస్టులకు బాధ్యుడని ఆరోపిస్తూ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదని వైసీపీ నేతలు పేర్కొన్నారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై ఐటీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో రాజకీయ వేడి మరింత పెరిగింది.గంజాయి కేసుపై టీడీపీ నిరసన తిరుపతిలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందంటూ టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇటీవల గంజాయి కేసులో ఓ వైసీపీ కార్యకర్త అరెస్టు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. యువతను గంజాయి బారిన పడకుండా కాపాడాలని, తిరుపతిని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని నినాదాలు చేశారు. వైసీపీ పాలనలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిందని ఆరోపించారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐకి వినతిపత్రం అందించారు.ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హై టెన్షన్ పరస్పర ఆందోళనలకు పిలుపునిచ్చిన వైసీపీ, టీడీపీ నేతలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుపడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. మహిళలను కించిపరిచిన టిడిపి నాయకుడు పై చర్యలు తీసుకోవాలని వైసిపి నేతలు నినాదాలు చేయగా.. తిరుపతిలో గంజాయి విక్రయిస్తున్న భాను ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ, గంజాయి రెడ్డి అంటూ కూటమి నినాదాలు చేశారు.ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొంతసేపు హడావిడి కొనసాగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అదుపు చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. అనంతరం ఇరు పార్టీల నేతలు తమ ఫిర్యాదులను పోలీసులకు అందజేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించిన అంశంపై కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం



