*అక్రమ గంజాయి రవాణా చేస్తూన్న అంతర్ రాష్ట్ర -ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీస్
*
*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు నల్లగొండ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా కేతేపల్లి పోలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించి, భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు, నాకాబందీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తేది 09-05-2026 ఉదయం కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ సతీష్ కి విజయవాడ వైపు నుండి హైదరాబాద్ దిశగా భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం అందింది. వెంటనే ఎస్.ఐ, పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్, పంచులతో కలిసి కొర్లపహాడ్ టోల్ ప్లాజా సమీపంలో మాటువేసి తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఉదయం సుమారు 09.30 గంటల సమయంలో సూర్యాపేట వైపు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న గ్రీన్ కలర్ అశోక్ లేలాండ్ లారీ నంబర్ HP-38-F-3447 అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అడ్డగించారు. పోలీసులు తనిఖీ చేయబోతుండగా లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి లారీ వెనుక భాగాన్ని తనిఖీ చేయగా నాలుగు పెద్ద ప్లాస్టిక్ బస్తాలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా బ్రౌన్ కలర్ టేప్ తో ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. క్లూస్ టీమ్ సిబ్బంది పరీక్షించగా అవి గంజాయి అని నిర్ధారించారు. మొత్తం 103 ప్యాకెట్లు ఉండగా ఒక్కో ప్యాకెట్ సుమారు ఒక కేజీ బరువు కలిగి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం గంజాయి బరువు సుమారు 104.5కేజీలు. అరెస్టు చేసిన నిందితులు
1). పరంవిర్ సింగ్ @ లంబు, తండ్రి లేట్ ఇక్బాల్ సింగ్, వయస్సు 42 సంవత్సరాలు, వృత్తి లారీ డ్రైవర్, నివాసం భోర్ క్యాంప్, వార్డ్ నం.1, సత్వరి, జమ్మూ. 2). షా అలం పర్వేష్ ఆలం అన్సారి, తండ్రి పర్వేష్ ఆలం అన్సారి, వయస్సు 37 సంవత్సరాలు, వృత్తి పెయింటింగ్ పని, నివాసం మదన్పూర్, న్యూ ధోబిఘాట్, ముంబాయి, మహారాష్ట్ర. 3) బిక్రం సింగ్ నివాసం సత్వరి, జమ్మూ (పరారీలో ) 4) ఫరూక్ @ రాజు భాయి నివాసం ముంబాయి (పరారీలో ) 5) భావు @ కేదర్ ప్రధాన్ నివాసం గంజం జిల్లా, ఒడిస్సా రాష్త్రం (పరారీలో ) విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. పరంవిర్ సింగ్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్న క్రమంలో జమ్మూకు చెందిన బిక్రం సింగ్ అనే వ్యక్తి ద్వారా ముంబైకి చెందిన ఫరూక్ @ రాజాభాయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఫరూక్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లా భిష్మాపూర్ అడవుల్లో భావు @ కేదర్ ప్రధాన్ అనే వ్యక్తి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి, ముంబైకు తరలించే అక్రమ వ్యాపారం జరుగుతోందని ఒప్పుకున్నారు. ఫరూక్ గతంలో జమ్మూలో దొంగతనం కేసులో అరెస్టై జైలుకు వెళ్లినట్లు, అక్కడే ఎన్ డి పి ఎస్ కేసులో ఉన్న ఫరూక్ తో పరిచయం ఉన్న షా అలం ను, పరంవిర్ సింగ్ కు పరిచయం చేస్తాడు.సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గతంలో రెండు సార్లు ఒడిశా అడవుల నుండి గంజాయి రవాణా చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రతి ట్రిప్పుకు తనకు రూ.50,000 చొప్పున ఇచ్చేవారని తెలిపారు.ఈసారి పెద్ద మొత్తంలో గంజాయి రవాణా చేస్తే రూ.1 లక్ష ఇస్తామని చెప్పడంతో తాము అంగీకరించినట్లు వెల్లడించారు. తేది 04-05-2026 న నాగ్పూర్ వద్ద ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లా భిష్మగిరి అడవులకు వెళ్లి భావు @ కేదర్ ప్రధాన్ అనే వ్యక్తి వద్ద నుండి గంజాయి తీసుకుని గంజాయిని నాలుగు బస్తాల్లో నింపి లారీ వెనుక భాగంలో దాచిపెట్టి, పోలీసుల తనిఖీలకు చిక్కకుండా అడవుల్లో ఆగుతూ విశాఖపట్నం, రాజమండ్రి, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో కేతేపల్లి పోలీసులకు కొర్లపాడు టోల్ గేటు వద్ద చిక్కినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వివరాలు.
1) 104.5 కేజీల గంజాయి
2) అశోక్ లేలాండ్ లారీ నంబర్ HP-38-F-3447
3) రెండు మొబైల్ ఫోన్ స్వాధీనం. ఈ కేసులో పరారీలో ఉన్న ముఠా ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న ఫరూక్ @ రాజు భాయి, బిక్రం సింగ్, భావు @ కేదర్ ప్రధాన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. అంతర్ రాష్ట్ర మాదకద్రవ్యాల నెట్వర్క్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, “మాదకద్రవ్యాల అక్రమ రవాణా యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఈ కేసును నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నకిరేకల్ సీఐ హరిబాబు ఆధ్వర్యంలో నిందితులను చాకచక్యంగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుబడి చేసిన కేతపల్లి ఎస్సై సతీష్, పోలీస్ సిబ్బంది బి వెంకటేశ్వర్లు, బి. వెంకట కృష్ణ, స్వామి, వెంకన్న, బాసిత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

