ఘట్కేసర్, ఏప్రిల్ 28 (ప్రజావాణి): శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాంని ఆయన నివాసంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం ఆధ్వర్యంలో సభ్యులు కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా, ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రికి తన తొలి లేఖ రాస్తానని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ అంశాలపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సమితి సభ్యులు కోదండరాంను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆ సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం తో పాటు, జాతీయ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకుడు మొక్క ఉపేందర్, వేణు గౌడ్, బుగ్గ మల్లేష్, శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, ఎలిమినేటి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




