📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarకెనాల్ నీరు బంద్ చేస్తే పంటలు ఎండిపోతాయి – రేకొండ రైతుల ఆవేదన

కెనాల్ నీరు బంద్ చేస్తే పంటలు ఎండిపోతాయి – రేకొండ రైతుల ఆవేదన

📰 Generate e-Paper Clip

మరో 15 రోజులు నీరు విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నపం

ప్రజావాణి ప్రతినిధి, చిగురుమామిడి:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామ రైతులు సాగునీటి కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామ శివారులోని కెనాల్ నీటిపై ఆధారపడి సుమారు 100 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే ప్రస్తుతం పంట కీలక దశలో ఉండగా నీటి సరఫరా నిలిపివేసే అవకాశం ఉందన్న వార్తలతో రైతులు బెంబేలెత్తుతున్నారు.
రబీ (యాసంగి) సీజన్ ప్రారంభంలో కెనాల్ కట్టలు తెగిపోవడం మరియు ఇతర సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సాగునీటిని సుమారు రెండు నెలల ఆలస్యంగా విడుదల చేశారు. దీంతో రేకొండ ప్రాంత రైతులు వరి నాట్లు వేయడం ఆలస్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పంటలు కోత దశకు వచ్చినప్పటికీ, ఇక్కడ మాత్రం సాగు లేటు కావడంతో పంటలు ప్రస్తుతం పాలు పోసుకునే (Milking stage) దశలో ఉన్నాయి.
ఈ దశలో నీరు అందకపోతే గింజ గట్టిపడక, వరి వెన్నులు ఎండిపోయి తాలుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎండలు తీవ్రమవ్వడం, భూగర్భ జలాలు అడుగంటడంతో కెనాల్ నీరే రైతులకు ఏకైక ఆధారం. ఒకవేళ అధికారులు ఇప్పుడే నీటిని నిలిపివేస్తే చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోయి రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు.ఈ సందర్భంగా రైతులు దొడ్ల తిరుపతిరెడ్డి, గండ్రతి రామయ్య, నక్క లింగయ్య, గండ్రతి తిరుపతి, అప్పాల శ్రీను, బండోజు సదయ్య, పీరాల వేణు మాట్లాడుతూ… తమ గోడును వెళ్లబోసుకున్నారు. పంటలను కాపాడేందుకు కెనాల్ ద్వారా మరో 15 రోజుల పాటు సాగునీటిని నిరంతరాయంగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రైతులు వేడుకుంటున్నారు. వంద ఎకరాల పంటను మరియు రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని గ్రామ రైతాంగం కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular