ఘట్‌కేసర్, నవంబర్ 27: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో తెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ అధ్యక్షుడు మోటుపల్లి ప్రదీప్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం సీఐ డాక్టర్ జగన్నాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతాపరెడ్డి, మంద విజయ్ కుమార్ వయమా ఉపాధ్యాయులు, రామ్ దాస్, భాషయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, విద్యార్థులకు మినీ రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. రాజ్యాంగం దేశానికి అత్యున్నత చట్టమని, దేశ పరిపాలన వ్యవస్థ, ప్రజల హక్కులు, విధులు, ప్రభుత్వ అధికారాల పరిధిని నిర్దేశిస్తుందని ముఖ్య అతిథులు విద్యార్థులకు వివరించారు.
నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొని వాటిని గౌరవించాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి, ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏనుగుతుల నాగేష్, రాష్ట్ర కోశాధికారి మోటుపల్లి శ్రీనివాస్, సంఘం సీనియర్ నాయకుడు కిన్నెర రవీందర్, ప్రధాన కార్యదర్శి మంద కృష్ణ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండె అర్జున్, అధికార ప్రతినిధి గార గోవర్ధన్, పొలగోని మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఏనుగుతుల నరేందర్, ఘట్‌కేసర్ ఎమ్మార్పీఎస్ నాయకులు నరేందర్, ఎండీ షబీర్ ఖాన్, బాలాజీ, బాన్సప్ రఘు తదితర నాయకులు పాల్గొన్నారు.


