📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణముచ్చర్ల వెళ్లే మార్గంలో మృత్యుపాశంగా మారిన మ్యాన్‌హోల్!

ముచ్చర్ల వెళ్లే మార్గంలో మృత్యుపాశంగా మారిన మ్యాన్‌హోల్!

📰 Generate e-Paper Clip

ముచ్చర్ల వెళ్లే మార్గంలో మృత్యుపాశంగా మారిన మ్యాన్‌హోల్!

ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దంటున్న స్థానికులు

తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.. స్థానికుడు పులిగారి రాజేష్ విజ్ఞప్తి

హసన్‌పర్తి, నవంబర్ 24, మన ప్రజావాణి:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హసన్‌పర్తి నుంచి 1వ డివిజన్ ముచ్చర్ల గ్రామానికి ఓఆర్ఆర్ పక్క నుంచి వెళ్లే ప్రధాన మార్గంలో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్ వాహనదారులు, పాదచారులకు ప్రాణసంకటంగా మారింది. రహదారికి ఆనుకొని ఉన్న ఈ మ్యాన్‌హోల్ చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, మట్టి పెళ్లలు, రాళ్లు కూలిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాన్‌హోల్ చుట్టూ ఏర్పడిన గుంతలో పిచ్చిమొక్కలు పెరిగి ఉండటంతో దాని లోతు బయటకు కనిపించడం లేదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాన్ని గుర్తించలేక గుంతలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అనేకమంది రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రమాదం జరిగాక స్పందిస్తారా? ముందే చర్యలు తీసుకోరా?

ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ మార్గంలో మ్యాన్‌హోల్ పరిస్థితి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ విషయంపై స్థానికుడు పులిగారి రాజేష్ మాట్లాడుతూ.. ముచ్చర్లకు వెళ్లే మార్గంలోని ప్రమాదకరమైన మ్యాన్‌హోల్‌ను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మ్యాన్‌హోల్‌కు పటిష్టమైన మూత ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల కూలిపోయిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రమాద సూచికలు, బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలని సూచించారు.

మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలి

సంబంధిత మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య తీవ్రతను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి ముచ్చర్ల వెళ్లే మార్గంలోని ప్రమాదకరమైన మ్యాన్‌హోల్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికుడు పులిగారి రాజేష్ కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.