*ప్రజా విశ్వాసంతో సర్పంచ్‌గా.. అభివృద్ధి బాటలో మహాలింగి!*
*యువ నాయకత్వంతో గ్రామంలో కొత్త మార్పులకు శ్రీకారం.. ఎన్నికలకు ముందే సామాజిక సేవలో గుర్తింపు.. పదవి చేపట్టగానే సొంత నిధులతో పనులు.. ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చడమే లక్ష్యం*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 20:–
నాయకత్వానికి వయసుతో సంబంధం లేదని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంటే చిన్న వయసులోనే గొప్ప మార్పులు తీసుకురావచ్చని నిరూపిస్తున్నారు నిర్మల్ జిల్లా తనూర్ మండలం మహాలింగి గ్రామ సర్పంచ్ విట్టల్ రావు శతనార్ (కృష్ణ). గ్రామ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించగలిగారు.
*సామాజిక సేవతో మొదలైన ప్రస్థానం..*
సర్పంచ్‌గా ఎన్నిక కాకముందే విట్టల్ రావు ప్రజా సేవలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే గ్రామంలోని సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గ్రామ ప్రజల ఆదరణతో విడీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో గ్రామంలో తెల్లకల్లు, నల్లకల్లు విక్రయాలను పూర్తిగా నిలిపివేయడంతో పాటు మత్తు పదార్థాలపై నిషేధం విధించేందుకు చొరవ తీసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక మార్పు కోసం కృషి చేశారు.
*బ్యాలెట్లో ప్రజల మద్దతు..* *భారీ మెజారిటీతో విజయం..*
ప్రజలతో ఏర్పడిన అనుబంధమే ఆయన రాజకీయ ప్రస్థానానికి బలంగా మారింది. 2025 గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో మహాలింగి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గ్రామంలో మొత్తం 1,600 మంది ఓటర్లు ఉండగా, 1,200 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 760 ఓట్లు సాధించి 262 ఓట్ల మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు. యువ నాయకత్వంపై గ్రామ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.
*పదవి చేపట్టగానే అభివృద్ధి పనులకు ప్రాధాన్యం..*
గ్రామంలో రహదారులు, మురుగు కాలువల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని గుర్తించిన సర్పంచ్, బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటి పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంతంగా సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసి రింగ్‌రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టారు. గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో స్వయంగా ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
*అభివృద్ధి పనులకు భారీగా నిధుల సమీకరణ..*
మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సహకారంతో మహాలింగి గ్రామానికి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ఉపాధి హామీ పథకం తదితర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టినట్లు తెలిపిన అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడకు రూ.48 లక్షలు, సీసీ రోడ్లకు రూ.50 లక్షలు, డ్రైనేజీకి రూ.15 లక్షలు, వీవో భవనానికి రూ.12 లక్షలు, వీవో షెడ్‌కు రూ.12 లక్షలు, గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి.
*సంక్షేమ పథకాలతో పేద కుటుంబాలకు అండ..*
గ్రామంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. చేయూత పింఛన్ల కోసం 35 దరఖాస్తులు చేయించగా, 32 మందికి పింఛన్లు మంజూరయ్యేలా కృషి చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రయోజనం అందేలా కృషి చేశారు. అంతేకాకుండా గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రయత్నించడం విశేషం.
*కుటుంబ వారసత్వంలో సేవా భావం..*
విట్టల్ రావు కుటుంబానికి మహాలింగి గ్రామంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన తాత గ్రామ వతన్దార్గా వ్యవహరించారు. కుటుంబానికి చెందిన సుమారు 300 ఎకరాల భూమిలో 180 ఎకరాలను ప్రభుత్వానికి సీలింగ్ భూమిగా అప్పగించగా, మరో 50 ఎకరాలను గ్రామంలోని నిరుపేదలకు ఉచితంగా అందించినట్లు గ్రామస్థులు గుర్తుచేస్తున్నారు. అదే సేవా భావాన్ని కొనసాగిస్తూ విట్టల్ రావు నేడు ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారు.
*ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..*
మహాలింగి గ్రామ అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఇచ్చిన హామీల అమలుపై సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాలింగి గ్రామాన్ని దత్తత తీసుకుని బ్రిడ్జిలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో ఆశించిన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు.
*ఆలయాల నిర్మాణం.. కుల సంఘాలకు భవనాలు లక్ష్యం..*
మహాలింగి గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సర్పంచ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సహకారంతో మహాలక్ష్మి ఆలయం, మహాదేవ్ ఆలయాల నిర్మాణానికి నిధులు సమకూర్చాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ కుల సంఘాల కోసం ప్రత్యేక భవనం మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే ప్రజాసేవను ప్రారంభించి, గ్రామ ప్రజల ఆదరణతో సర్పంచ్‌గా ఎదిగిన విట్టల్ రావు శతనార్ (కృష్ణ) మహాలింగి అభివృద్ధికి మరింత కృషి చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలనే వారికి ఆయన ప్రస్థానం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

