పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
రేషన్ కార్డులు, సన్నబియ్యం, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు భరోసా
అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 20:
గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేస్తోందని సామాజిక ఉద్యమకారుడు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొంకటి లింగమూర్తి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు మద్దతుగా శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొంకటి లింగమూర్తి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కొంకటి లింగమూర్తి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు కార్డులు మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు, పేదలు కూడా ఇతరులతో సమానంగా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 4 లక్షల 63 వేల మందికి పెన్షన్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో ఆనందదాయకమని తెలిపారు.
కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అలాంటి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇందిరమ్మ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.
ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ విజయరమణారావులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అప్పన్నపేట సింగిల్ విండో మాజీ సభ్యుడు ఆరె తిరుపతి, కుమ్మరి కమల్, కందుల సత్యనారాయణ, కనుకుల సదయ్య, ఎండీ ఖలీఫ్, ఎండీ బాబుజాన్, ఎండీ సర్వర్, కుక్కల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

