*రాజగోపాల్ రెడ్డి తీరుపై డిసిసి అధ్యక్షుడు కైలాష్ నేత గరం గరం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపై నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్నా కైలాష్ నేత తీవ్రంగా మండిపడ్డారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రాజగోపాల్ రెడ్డి రాజీనామా చెయ్, కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపో” అని సవాల్ విసిరారు. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, కొత్త పెన్షన్లు ప్రజలకు ఇవ్వడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. “ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి, దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకొని నీ దమ్ము చూపించు” అని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, రాష్ట్రం సంక్షేమంలో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. 2014 నుండి కాంగ్రెస్ జెండాను కింద పడేశావని, ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల భవిష్యత్తు కోసం మాట్లాడావా అని నిలదీశారు. నువ్వు వచ్చింది కేవలం ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, కాంట్రాక్టర్ల కోసమేనా అని విమర్శించారు. మీ తీరు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని, మీ మాటలు బీఆర్ఎస్, బీజేపీ కోసమేనా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి తీరు మారకపోతే నష్టం మీకే అని, ఆయనపై చర్యలు అధిష్టానం తీసుకుంటుందని కైలాష్ నేత స్పష్టం చేశారు.

