పెన్షన్ రాని ప్రతి ఒక్కరి గొంతుకగా నిలుస్తా.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గంలో మంగళవారం మూడు చోట్ల నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాల్లో జనగాం ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని రైతు వేదిక వద్ద, జనగామ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో, బచ్చన్నపేట మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ మండలంలోని 21 గ్రామాల్లో ఐదు కేటగిరీల కింద 781 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో 412 మంది వితంతువులు, 86 మంది ఒంటరి మహిళలు, 218 మంది దివ్యాంగులు, 28 మంది నేత కార్మికులు, 77 మంది గీత కార్మికులు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం సుమారు 863 మందికి కొత్త పెన్షన్లు వచ్చాయి.
గత మూడేళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి ఇప్పుడు ఐదు రకాల పెన్షన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నారు.
పెన్షన్ల మంజూరులో అధికారులు అనుసరిస్తున్న కొన్ని నిబంధనల వల్ల నిజమైన పేదలకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ కోసం బ్యాంకు రుణం తీసుకుని ట్రాక్టర్, డీసీఎం వంటి వాహనాలు కొనుగోలు చేసిన వారిని సంపన్నులుగా భావించి పెన్షన్ నిరాకరించడం సరికాదన్నారు. చాలామంది ఆ వాహనాలను అద్దెకు నడుపుకుంటూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారని, విలాసవంతమైన కార్లకు, జీవనోపాధి వాహనాలకు తేడా చూడాలని సూచించారు.
అదే విధంగా ఒకే కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తోందని మరో అర్హుడికి నిరాకరించడం, ఇంట్లో కొడుకుకు, కోడలికి ఉద్యోగం ఉందని వృద్ధులైన తల్లిదండ్రులకు, దివ్యాంగులకు పెన్షన్ ఆపేయడం మానవత్వం కాదన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద పెన్షన్ ఇవ్వాలని, వారి విషయంలో నిబంధనలను పునఃపరిశీలించాలని కలెక్టర్ తో పాటు అధికారులను కోరారు.
ఆన్ లైన్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, వివిధ కారణాలతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు, బీడీ కార్మికుల రెండో పెన్షన్ ఇంకా రాలేదని, బచ్చన్నపేట ప్రాంతం నుంచి కూడా తనకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ అర్హులను గుర్తించి సాచురేషన్ విధానంలో పెన్షన్లు ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెన్షన్ వ్యవస్థ విస్తృతమైందని, సుమారు 42 లక్షల పెన్షన్లు పెరిగాయని గుర్తు చేశారు. దివ్యాంగులు, ఎయిడ్స్, కిడ్నీ, లివర్, బోధకాలు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, సుమారు 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందించడం గొప్ప సంక్షేమ కార్యక్రమమన్నారు. ఆసరా, చేయూత ద్వారా అభాగ్యులకు, అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
వివిధ వర్గాల పెన్షన్లను 10 నుంచి 15 శాతం మేర పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ను రూ.4,000 కు పెంచాలని, ఇచ్చిన హామీని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ, ఆర్బీఎస్, ఆరోగ్య, విద్యా రంగాల సమస్యల పరిష్కారంలోనూ తన వంతు కృషి కొనసాగిస్తానన్నారు. ప్రజలు తనను కాపలాదారుగా ఎన్నుకున్నారని, వారి బాగోగులు చూసుకోవడం తన బాధ్యతన్నారు.
అధికారులు సమస్యలు పరిష్కరించినా, పరిష్కరించకపోయినా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిరంతరం నిలబడతానని, పెన్షన్ అందని ప్రతి ఒక్కరి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మండల అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


