నారాయణఖేడ్ నియోజకవర్గం:-
( ప్రజావాణి)ఇంచార్జ్ మదుసుదన్
చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నిజాంపేట్: మండల కేంద్రంలోని ఎన్. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మండలానికి చెందిన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాకు అత్యధిక సంఖ్యలో చేయూత పెన్షన్లు మంజూరు కాగా, నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా పెన్షన్లు రావడం విశేషమన్నారు. నిజాంపేట్ మండలానికి మొత్తం 344 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన అనేక కుటుంబాలు, ముఖ్యంగా దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారే తప్ప పేద ప్రజలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు. ఇంకా అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

