📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగంగాధర్ నాయక్ కు ఘన సన్మానం

గంగాధర్ నాయక్ కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*గంగాధర్ నాయక్ కు ఘన సన్మానం*

—మారుమూల తండా బిడ్డకు జిల్లా స్థాయి గుర్తింపు

*రాయికల్: నవంబర్ 17(ప్రజావాణి)*

కళ అంటే కేవలం వినోదం కాదు, అది ప్రజల గొంతుక. ఆ గొంతుకను తండా నుంచి జిల్లా స్థాయి వరకు వినిపించిన వ్యక్తి భూక్య గంగాధర్ నాయక్.రాయికల్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం ఓడ్డె లింగాపూర్ ఎం.ఎన్ తండాలో పుట్టి పెరిగిన గంగాధర్ నాయక్, నేడు జగిత్యాల కళాకారుల ఐక్యవేదిక జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికై తన తండాకే కాదు, యావత్ బంజారా జాతికే గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, యువ నాయకులు మంగళవారం ఆయనను ఘనంగా సన్మానించారు.బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే, తండాల్లో ఉన్న సమస్యలను పాట రూపంలో, రచన రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో గంగాధర్ నాయక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్నతనం నుంచే పాటలంటే మక్కువ. తండాలో జరిగే ప్రతి పండుగలో, ప్రతి సభలో తన గళంతో అందరినీ ఆకట్టుకునేవారు. క్రమంగా ఆ పాట కేవలం పాటగా మిగలకుండా, ప్రజా ఉద్యమ గీతంగా మారింది.గిరిజన తండాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి సమస్యలపై తన రచనల ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించారు. బంజారా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, విద్య వైపు, సంస్కృతి వైపు మళ్లాలని తన పాటల ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు. బంజారా భాషలో, తెలుగులో ఆయన రాసిన పాటలు నేడు యూట్యూబ్ లో మారుమోగుతున్నాయి.ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ఎలాంటి అండదండలు లేకుండా, కేవలం తన ప్రతిభ, పట్టుదలతోనే జిల్లా స్థాయికి ఎదిగిన గంగాధర్ నాయక్ విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సర్పంచులు కొనియాడారు. తండాలో పుట్టిన బిడ్డ జిల్లాను శాసించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదని, మున్ముందు రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన మరింత పెద్ద పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.జిల్లా కళాకారుల ఐక్యవేదిక అంటే కేవలం కళాకారుల సంఘం మాత్రమే కాదు, అది వేలాది మంది కళాకారుల హక్కుల కోసం పోరాడే వేదిక. అలాంటి వేదికలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ నాయక్ ఎన్నిక కావడం వెనుక ఆయనకు కళాకారుల్లో ఉన్న ఆదరణే కారణమని నాయకులు తెలిపారు. గ్రామీణ కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్, ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని గంగాధర్ నాయక్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో ఎం.ఎన్ తండా సర్పంచ్ మాలవత్ తిరుపతి నాయక్, చింతలూరు సర్పంచ్ బానవత్ వనిత రమేష్, కొత్తపేట వడ్డెర కాలనీ సర్పంచ్ బోదాసు చంద్రశేఖర్, యువ నాయకులు అనుపురం రమేష్, పాల్త్య ప్రభాకర్, మాలవత్ నరేందర్, బోదాసు అనిల్, భూక్య నందు నాయక్, లావుడియా సురేష్, బంగ్లా శ్రీను తదితరులు పాల్గొని శాలులవాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.